Bandi Sanjay: సీబీఐ విచారణ జరిపించండి: కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
- హైదరాబాద్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
- ఈ ఘటనపై ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్న బండి సంజయ్
- పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్య
హైదరాబాద్ లో ఒక మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అధికార పార్టీకి సంబంధించిన నేతల పిల్లలు కూడా ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో... ఈ ఘటన రాజకీయపరంగా కూడా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగలేఖ రాశారు.
ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని లేఖలో బండి సంజయ్ మండిపడ్డారు. ఈ ఘటన జరిగి రోజులు గడిచిపోతున్నా పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. రాష్ట్ర హోంమంత్రి మనవడు, మీకు రాజకీయ మిత్రులైన ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు, టీఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా ఇప్పటికే మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో అనే వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని అన్నారు.