Telangana: మళ్లీ హైదరాబాద్ కు వచ్చిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
- ఇవాళ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యే చాన్స్
- జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం
- దేశ రాజకీయాలపై క్రియాశీలంగా మారుతున్న కేసీఆర్
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మరోసారి హైదరాబాద్ కు వచ్చారు. ఇవాళ ఆయన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాలు, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సీఎం కేసీఆర్ ఇటీవల కీలక అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ఆయన భేటీ అయిన విషయమూ విదితమే. ఆ తర్వాత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ఢిల్లీ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించిన రైతులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అదే సమయంలో యూపీ ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ తోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఇక, ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిన కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామితోనూ మంతనాలు జరిపారు. ఇక, అంతకముందు హేమంత్ సోరెన్ తో రెండు సార్లు కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. మొదట హేమంత్ సోరెన్.. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు.
ఆ తర్వాత కొన్ని రోజులకు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఝార్ఖండ్ వెళ్లారు. సోరెన్ కుటుంబంతో ఆప్యాయ సమావేశం నిర్వహించారు. హేమంత్ తండ్రి శిబూ సోరెన్ తోనూ కేసీఆర్ సమావేశమై కీలక విషయాలను చర్చించారు. దీంతో ఇవాళ్టి తాజా సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.