YSRCP: వైవీ సుబ్బారెడ్డికి రాజీనామా లేఖ పంపిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్
- టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి
- ఇటీవలే వైసీపీకి చేరువ అయిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే
- నియోజకవర్గ సమన్వయకర్త పదవికి వాసుపల్లి రాజీనామా
- వైవీ సుబ్బారెడ్డి, అవంతి శ్రీనివాస్‌లకు లేఖ
- సీతంరాజు సుధాకర్‌తో విభేదాలు కారణమంటూ ప్రచారం
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి సంబంధించి కీలకమైన విశాఖ నగర శాఖలో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. 2019 ఎన్నికల్లో విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేశ్ కుమార్... కొంతకాలం క్రితం వైసీపీకి చేరువ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా వాసుపల్లి గణేశ్ వ్యవహరిస్తున్నారు. అయితే, నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం వాసుపల్లి కీలక ప్రకటన చేశారు.
వెంటనే తన రాజీనామా లేఖను పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జీ అవంతి శ్రీనివాస్‌లకు పంపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న సీతంరాజు సుధాకర్ కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే. సీతంరాజుతో విభేదాల కారణంగానే వాసుపల్లి పార్టీ పదవికి రాజీనామా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే... విశాఖ జిల్లాకు సంబంధించి పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి శనివారమే తొలిసారి విశాఖ వచ్చారు.