Governor: రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ సీరియస్
- సమగ్ర నివేదికకు సీఎస్, డీజీపీకి ఆదేశం
- మీడియా కథనాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడి
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ఘటనపై సీరియస్ అయిన ఆమె.. తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటన తనను కలచివేసిందన్నారు. ఘటనకు సంబంధించి మీడియా కథనాలను తాను పరిశీలిస్తున్నానని, కేసుకు సంబంధించిన పూర్తి నివేదికను రెండు రోజుల్లోగా అందించాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆమె ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలను తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు.
అమ్నీషియా పబ్ నుంచి బాలికను ఐదుగురు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు పోలీసుల తీరుపై మండిపడ్డాయి. మొదట్లో హోం మంత్రి మహమూద్ అలీ మనవడు ఉన్నాడని ఆరోపణలు వచ్చినా.. వాటిని పోలీసులు ఖండించారు. ఇటు ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడన్న ఆరోపణలు వచ్చాయి. నిన్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చూపిన విషయం తెలిసిందే.