YV Subba Reddy: తిరుమలలో రాబోయే రోజుల్లో మరిన్ని పర్యావరణహిత నిర్ణయాలు అమలు చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy wishes on World Environment Day

  • నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
  • ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన వైవీ సుబ్బారెడ్డి
  • తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధించామని వెల్లడి
  • విద్యుత్ వాహనాల వినియోగం తీసుకువచ్చామని వివరణ

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యం అవుతుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

గత మూడేళ్లలో టీటీడీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రాన్ని కాలుష్య రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 

ఇందులో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించామని తెలిపారు. కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాన్ని రెండేళ్ల కిందటే నిషేధించినట్టు వెల్లడించారు. తిరుమలలో 10 వేల మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. తిరుమలలో విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం ప్రారంభించామని, త్వరలోనే ఆర్టీసీ 100 విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. 

శ్రీవారి ప్రసాదాల కౌంటర్లలో ప్లాస్టిక్ బ్యాగ్ లు నిషేధించామని, వాటి స్థానంలో జూట్, పర్యావరణానికి హాని కలిగించని బ్యాగ్ లు అందుబాటులో ఉంచామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యావరణ హిత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పండించిన శెనగలు, బియ్యం, బెల్లం టీటీడీ కొనుగోలు చేస్తుందని వివరించారు.

  • Loading...

More Telugu News