Harbhajan Singh: నేను చేసింది ముమ్మాటికీ తప్పే.. శ్రీశాంత్ చెంప దెబ్బ ఘటనపై హర్భజన్
- తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడి
- ఆ ఘటన తాను సిగ్గుపడేలా చేసిందని కామెంట్
- సరిచేసుకోవాలనుకున్న ఏకైక తప్పు అదేనని వ్యాఖ్య
టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ చెంప చెళ్లుమనిపించిన ఘటన గుర్తుందా? ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో హర్భజన్ ఒక్కటిచ్చిన ఆ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో గుర్తుండే ఉంటుంది. ‘స్లాప్ గేట్’గా పేరుపడిపోయిన ఆఘటనను ఎవరు మాత్రం మరిచిపోతారు. ముంబై తరఫున ఆడుతున్న భజ్జీ కొట్టడం.. పంజాబ్ ప్లేయర్ అయిన శ్రీశాంత్ వలవలమని ఏడ్చేయడం.. సహచరులు ఓదార్చడం.. చెప్పుకుంటూ పోతే అది ఓ పెద్ద కథే.
ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకంటారా? ఆ ఘటనకు కారణమైన హర్భజన్ సింగ్ తాజాగా స్పందించాడు మరి. తప్పంతా తనదేనని ఒప్పుకొన్నాడు. ఆ ఘటనను తనను సిగ్గుపడేలా చేసిందన్నాడు. ‘‘అప్పుడు ఏదైతే జరిగిందో అది ముమ్మాటికీ తప్పే. నేను తప్పు చేశాను. నా వల్ల నా తోటి క్రీడాకారుడు సిగ్గుపడాల్సి వచ్చింది. నన్నూ సిగ్గుపడేలా చేసింది’’ అని గ్లాన్స్ లైవ్ ఫెస్ట్ లో మాట్లాడుతూ చెప్పాడు.
తాను సరిదిద్దుకోవాల్సిన తప్పు ఏదైనా ఉందంటే.. అది మైదానంలో శ్రీశాంత్ పై తాను ప్రవర్తించిన తీరేనని అన్నాడు. అప్పుడు అలా జరిగి ఉండాల్సింది కాదన్నాడు. ఆ ఘటన గుర్తొచ్చినప్పుడల్లా అలా కొట్టాల్సిన అవసరం లేదనిపిస్తుందని పేర్కొన్నాడు. కాగా, ఆ ఒక్క చెంప దెబ్బతో ఆ టోర్నీలో మిగతా 11 మ్యాచ్ లన్నింటికీ భజ్జీ దూరమవ్వాల్సి వచ్చింది.
మరోవైపు భజ్జీతో తనకిప్పుడు ఎలాంటి విభేదాలు లేవని గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ కూడా చెప్పాడు. సచిన్ టెండూల్కర్ ఇద్దరికీ విందు ఏర్పాటు చేసి ఆ వివాదం సద్దుమణిగేలా చేశాడని, అందుకు సచిన్ కు ఎప్పటికీ రుణ పడి ఉంటానని అన్నాడు. అయితే, మీడియా మాత్రం ఆ ఘటనను వేరే లెవెల్ కు తీసుకెళ్లిందని పేర్కొన్నాడు.