Telangana: తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు.. నేడు అక్కడక్కడ వర్షాలు!
- గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
- సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో నిన్న 5.5 సెంటీమీటర్ల వర్షపాతం
- ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి
తెలంగాణలో నేడు అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వాటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం 40 నుంచి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న అత్యధికంగా నల్గొండ జిల్లా కేతేపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి రుతుపవనాల రాకకు ముందు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం సాధారణ విషయమేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిన్న సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, నిన్న మధ్యాహ్నం 2.59 గంటలకు రాష్ట్రంలోనే అత్యధికంగా 8,920 మెగావాట్ల విద్యుత్ వినియోగమైంది. గతేడాది ఇదే రోజు 6,560 మెగావాట్ల విద్యుత్ వినియోగమైంది. గత పది రోజుల్లో ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం పెరగడం ఇదే తొలిసారని విద్యుత్ అధికారులు తెలిపారు.