Salman Khan: సల్మాన్ ఖాన్ కు కట్టుదిట్టమైన భద్రత
- మహారాష్ట్ర హోంశాఖ నిర్ణయం
- సల్మాన్, ఆయన తండ్రిని చంపుతామంటూ ఆగంతుకుల హెచ్చరిక
- వాకింగ్ చేసే ప్రాంతంలో సల్మాన్ కు కనిపించిన లేఖ
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ భద్రతను మరింత పటిష్ఠం చేస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ‘పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్, సలీమ్ ఖాన్ కు త్వరలోనే పడుతుందని పేర్కొంటూ’ హెచ్చరిక లేఖను గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించింది.
‘తుమ్హారా మూసే వాలా కర్ దేంగే’ అని సదరు లేఖలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అందులో రాసిన వారు పేరు కానీ, సంతకం కానీ లేవు. సల్మాన్ ఖాన్ రోజూ వాకింగ్ చేసే ప్రాంతంలో బల్లపై కూర్చుంటారు. దానిపైనే ఆగంతుకులు లేఖను వదిలి వెళ్లారు. తన సెక్యూరిటీ గార్డుల ద్వారా పోలీసులకు సల్మాన్ సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ లోగడ సల్మాన్ విషయంలో హెచ్చరిక చేయడం గమనార్హం.