petrol: పెట్రోల్ రూపం మారిపోతోంది.. 10 శాతానికి ఇథనాల్ మిశ్రమం
- ఈ మేరకు తగ్గనున్న పర్యావరణ కాలుష్యం
- ఏటా రూ.41,000 కోట్లు ఆదా
- రైతులకు ఈ మేరకు అదనపు ఆదాయం
- 2025 నుంచి 20 శాతానికి ఇథనాల్
మన పెట్రోల్ స్వరూపం మారిపోతోంది. పెట్రోల్ లో ఇప్పుడు 10 శాతం ఇథనాల్ మిశ్రమమే. మన దేశ మొత్తం ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతుల ద్వారా భర్తీ చేసుకుంటున్నాం. దీంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడ్డాం. దీనివల్ల ధరలు పెరిగినప్పుడల్లా మన ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతోంది. విలువైన విదేశీ మారకాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
అందుకని కేంద్రంలోని మోదీ సర్కారు పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమాన్ని మరింత మొత్తంలో కలిపి విక్రయించాలన్న ప్రణాళికతో పనిచేస్తోంది. ఫలితమే ఇథనాల్ మిశ్రమం 10 శాతానికి చేరడం. మరో మూడేళ్లలో (2025) ఇథనాల్ ను 20 శాతానికి చేర్చాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. 10 శాతానికి ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడం వల్ల మనకు ఏటా రూ.41,000 కోట్లు ఆదా అవుతుంది. 27 లక్షల టన్నుల కర్బన ఉద్గారాల విడుదల తగ్గిపోతుంది. రైతులకు రూ.40వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ఇషా ఫౌండేషన్ ‘భూసారాన్ని కాపాడండి’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఈ వివరాలు వెల్లడించారు.
వినియోగదారులకు కూడా ఇది ప్రయోజనమే. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. లీటర్ పెట్రోల్ పై చెల్లిస్తున్న రూ.2 పొల్యూషన్ ట్యాక్స్ ను వచ్చే అక్టోబర్ 1 నుంచి వినియోగదారులు చెల్లించక్కర్లేదు. వాస్తవానికి పెట్రోల్ లో ఇథనాల్ శాతాన్ని 2030 నాటికి 20 శాతానికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 120 డాలర్లకు చేరిపోవడంతో లక్ష్యాన్ని చాలా ముందుకు జరిపారు.