TTD: తిరుమలేశుడికి తమిళ భక్తుల భూరి విరాళం... టీటీడీ చరిత్రలో ఇదే అత్యధికమట
- తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ రూ.7 కోట్ల విరాళం
- అన్నదానం సహా 7 టీటీడీ ట్రస్టులకు రూ.1 కోటి చొప్పున విరాళం
- మరో ముగ్గురు భక్తుల నుంచి రూ.3 కోట్ల విరాళం
- ఒకే రోజు స్వామి వారికి రూ.10 కోట్ల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తుల నుంచి విరాళాలు పోటెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే సోమవారం అత్యధిక మొత్తంలో శ్రీవారికి విరాళాలు అందాయి. ఈ మేరకు తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు స్వామి వారి పట్ల తమకున్న భక్తిని ఇలా విరాళం రూపంలో చాటుకున్నారు. నలుగురు భక్తుల్లో ఓ భక్తుడు ఏకంగా రూ.7 కోట్ల విరాళాన్ని అందించారు. మరో ముగ్గురు భక్తులు రూ.1 కోటి చొప్పున విరాళాలు అందించారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి వారు తిరుమలలో సోమవారం చెక్కులు అందజేశారు.
ఈ విరాళాల వివరాల్లోకెళితే... తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ ఒక్కరే స్వామివారికి రూ.7 కోట్ల విరాళం అందించారు. అన్నదానం సహా టీటీడీ నిర్వహణలోని 7 ట్రస్టులకు రూ.1 కోటి చొప్పున ఆయన విరాళం అందించారు. విద్యాదాన ట్రస్టుకు ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్సెక్షన్ సంస్థ రూ.1 కోటి విరాళాన్ని అందించింది. శ్రీవాణి ట్రస్టుకు బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ సంస్థ రూ.1 కోటి విరాళం సమర్పించింది. ఎస్వీ వేద పరిరక్షణ సంస్థకు సీ హబ్ ఇన్సెక్షన్ సర్వీసెస్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. మొత్తంగా ఒకే రోజు వ్యక్తిగత హోదాల్లో నలుగురు భక్తులు స్వామి వారికి ఏకంగా రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు.