Sergie Lavrov: రష్యా విదేశాంగ మంత్రి విమాన ప్రయాణాన్ని అడ్డుకున్న నాటో దేశాలు
- సెర్బియా వెళ్లాలనుకున్న సెర్గీ లవ్రోవ్
- రష్యా విమానానికి నో చెప్పిన నాటో దేశాలు
- తమ హక్కును తొక్కేశారంటూ మండిపడిన లవ్రోవ్
- ఊహించరాని విషయం జరిగిపోయిందని వ్యాఖ్య
సెర్బియా వెళ్లాలని భావించిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ కు నాటో దేశాలు అడ్డుకట్ట వేశాయి. వాస్తవానికి లవ్రోవ్ పర్యటనను రష్యా, సెర్బియా నిర్ధారించాయి. అయితే, లవ్రోవ్ విమానం తమ గగనతలం మీదుగా ప్రయాణించడానికి వీల్లేదని నాటో సభ్యదేశాలు బల్గేరియా, నార్త్ మాసిడోనియా, మాంటేనీగ్రో స్పష్టం చేశాయి. దాంతో లవ్రోవ్ పర్యటన నిలిచిపోయింది.
దీనిపై ఆయన స్పందిస్తూ, ఒక ఊహించరాని విషయం జరిగిందని పేర్కొన్నారు. ఒక సార్వభౌమ దేశం తన విదేశాంగ విధానాలను అమలు చేసే హక్కును తొక్కివేశారని వ్యాఖ్యానించారు. రష్యాతో సెర్బియా అంతర్జాతీయ కార్యకలాపాలను అడ్డుకున్నారని మండిపడ్డారు. అంతకుముందు, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిచ్ ను రష్యా రాయబారి కలిసి విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పర్యటన నిలిచిపోయిన విషయం చెప్పారు. దీనిపై వుసిచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు రష్యా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.