BJP: మహ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి స్పందన
- పరమత సహనం అవసరమని కామెంట్
- అన్ని మతాలనూ గౌరవించాలని విజ్ఞప్తి
- ఏం జరిగిందో తనకు తెలియదన్న గుటెరస్ ప్రతినిధి
మహ్మద్ ప్రవక్త మీద బీజేపీ బహిష్కృత నేత నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు నిరసన గళం వినిపిస్తున్న వేళ.. ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. పరమత సహనం అవసరమంటూ భారత్ కు సూచించింది. అన్ని మతాలనూ గౌరవించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టెఫానీ డుజారెక్ అన్నారు. వ్యాఖ్యలపై గుటెరస్ స్పందన ఏంటంటూ ఆయన ప్రతినిధిని పాకిస్థాన్ కు చెందిన ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం వచ్చింది.
తాను కేవలం వార్తా కథనాలనే చూశానని, అసలు ఏం జరిగిందన్నది తమకు తెలియదని అన్నారు. ఏదిఏమైనా అందరూ అన్ని మతాలనూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఇప్పటికే ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలు బీజేపీ నేత వ్యాఖ్యలను నిరసించిన సంగతి తెలిసిందే.