MS Dhoni: ధోనీ భాయ్ నా భవిష్యత్ గురించి ముందే చెప్పాడు: హార్థిక్ పాండ్యా
- 2016లో భారత జట్టులోకి వచ్చిన పాండ్యా
- కేవలం మూడు మ్యాచులతోనే ప్రపంచకప్ జట్టులో చోటు
- ధోనీ చూపించిన నమ్మకంతోనే ఈ స్థాయికి చేరామన్న పాండ్యా
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా తొలి సీజన్ లోనే టైటిల్ గెలిచి, విజయవంతమైన కెప్టెన్ గా గుర్తింపు పొందుతున్న హార్థిక్ పాండ్యా.. టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఎంతో అభిమానిస్తాడు. వీలైన ప్రతి సందర్భంలో మహీని గుర్తు చేసుకుంటాడు. ఈ క్రమంలోనే ధోనీ గురించి మరోసారి పాండ్యా మాట్లాడాడు.
ధోనీ సారథ్యంలో కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ భారత జట్టులో చోటు సంపాదించుకోవడమే కాకుండా, తామేంటో నిరూపించుకున్న క్రికెటర్లు. వీరికి ధోనీ సంపూర్ణ మద్దతు కూడా సాయపడింది. ఇలా ధోనీ సారథ్యంలో 2016లో టీమిండియాలోకి హార్థిక్ పాండ్యా సైతం అడుగు పెట్టాడు. గొప్ప ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో ధోనీ నుంచి తనకు లభించిన మద్దతును పాండ్యా బయటపెట్టాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో మొదటి ఓవర్లోనే పాండ్యా 21 పరుగులు సమర్పించుకున్నాడు. మరో కెప్టెన్ అయితే ఇంకో ఓవర్ ఇచ్చే సాహసం చేసి ఉండేవాడు కాదు. ‘‘నేను కూడా అదే నాకు చివరి ఓవర్ అనుకున్నాను. కానీ, నేను చాలా అదృష్టవంతుడిని. ధోనీ నాపై నమ్మకంతో మళ్లీ బాల్ అప్పగించాడు. నాపై ధోనీ భాయ్ ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మూడు ఓవర్లకు 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాను.
నేను భారత జట్టులోకి అడుగు పెట్టినప్పుడు నేను పెరుగుతూ చూసిన ఆటగాళ్లు సురేష్ రైనా, హర్బజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రాలను స్వయంగా చూడగలిగాను. మహీ భాయ్ సారథ్యంలో ఆడడం నా అదృష్టం, దీవెన. అతడు మా పట్ల ఎంతో నమ్మకాన్ని ఉంచాడు. అదే మేము ఈ రోజు ఈ స్థాయికి చేరుకునేందుకు సాయపడింది.
అంతర్జాతీయ కెరీర్ లో నా మూడో మ్యాచ్ అనంతరం.. ప్రపంచకప్ జట్టులో నీవు ఉంటావు అని ధోనీ చెప్పాడు. మొదటి మూడు మ్యాచుల్లో నేను బ్యాటింగ్ చేయలేదు. అయినా అతడు నాకు హామీ ఇచ్చాడు. నా కల నిజమైంది’’ అని హార్థిక్ పాండ్యా తన అంతరంగాన్ని పంచుకున్నాడు.