Andhra Pradesh: విద్యా ప్రమాణాలు దిగజారాయి.. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: ధూళిపాళ్ల నరేంద్ర
- రాష్ట్రంలో ఇంతటి ఘోర వైఫల్యం ఎన్నడూ చూడలేదని వ్యాఖ్య
- ఉత్తీర్ణత 67 శాతానికి పడిపోయిందని మండిపాటు
- తల్లిదండ్రులపైకి బాధ్యత నెట్టేయడమేంటని నిలదీత
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. పదోతరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి విమర్శలు గుప్పించారు. ఉత్తీర్ణత శాతం ఇంత తక్కువగా నమోదవడం.. ప్రభుత్వ దిగజారిన విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత ఘోరమైన వైఫల్యం ఎప్పుడూ చూడలేదని అన్నారు. టీడీపీ హయాంలో 94 శాతం ఉత్తీర్ణత నమోదైతే.. జగన్ హయాంలో అది 67 శాతానికి పడిపోయిందని విమర్శించారు. ఇవాళ ఆయన మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.
విద్యా శాఖ మంత్రి లేడని చెప్పి ఫలితాలను ఆపారంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఆరు లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాస్తే.. 2 లక్షల మందికిపైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, దానికి బాధ్యత తీసుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి తప్పును విద్యార్థుల తల్లిదండ్రుల మీదకు నెట్టేయడం దారుణమని ఫైర్ అయ్యారు.
పదో తరగతి ఫలితాలను చూసి కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ ఘటనలు చూస్తే బాధేస్తోందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాల్లో లోపాల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ధూళిపాళ్ల మండిపడ్డారు. విద్యావ్యవస్థను ప్రభుత్వం నాశనం చేసిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు దానికి తగినట్టు ప్రభుత్వం టీచర్ నియామకాలను ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మాతృభాషలో బోధనను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇంగ్లిష్ మీడియం వల్ల చిన్నారులు నష్టపోతున్నారన్నారు. 5 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసేసే పరిస్థితికి తీసుకొచ్చారని, దాని వల్ల వెనుకబడిన వర్గాల వారు చదువుకు దూరమయ్యే దుస్థితి ఏర్పడిందని అన్నారు.