Kollu Ravindra: రెండు లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఫెయిల్ కావడంపై సీబీఐతో విచారణ జరిపించాలి: కొల్లు రవీంద్ర
- పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న రవీంద్ర
- అమ్మఒడి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించిందనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్య
- విద్యార్థులు, తల్లిదండ్రుల తరపున టీడీపీ పోరాడుతుందని హామీ
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో 2 లక్షలకు పైగా విద్యార్థులు ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితాలు ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇంత మంది విద్యార్థులు ఫెయిల్ కావడం ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫలితాలను ప్రకటిస్తామన్న రోజు కాకుండా, మూడు రోజుల ఆలస్యంగా ఫలితాలను ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు.
అమ్మఒడి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందనే అనుమానం కలుగుతోందని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని, వీరి తరపున తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పారు. టీచర్లను రాష్ట్ర ప్రభుత్వం వేధించిందని విమర్శించారు.