TDP: టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి
- కమలాపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు
- 1994లో టీడీపీ అభ్యర్థిగా తొలి సారి ఎమ్మెల్యేగా విజయం
- 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన వీరశివారెడ్డి
- తాజాగా నారా లోకేశ్‌తో వీరశివారెడ్డి భేటీ
- త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు ప్రకటన
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందిన సీనియర్ రాజకీయవేత్త గుండ్లూరు వీరశివారెడ్డి మంగళవారం ఓ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను టీడీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయిన ఆయన ఆ తర్వాత ఈ ప్రకటన చేశారు. కడప జిల్లా రాజకీయ పరిణామాలపై లోకేశ్‌తో చర్చించిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిసిన తర్వాత పార్టీలో చేరతానని వెల్లడించారు.
కడప జిల్లా కమలాపురం కేంద్రంగా రాజకీయం చేస్తున్న వీరశివారెడ్డి తొలుత టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1994లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంవీ మైసూరారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2004లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ అదే స్థానం నుంచి గెలిచిన ఆయన 2009 ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూటికి చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచే గెలిచిన వీరశివారెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికిన ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో చేరిపోయారు. అయితే ఆ పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదని భావించిన వీరశివారెడ్డి చాలా కాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కమలాపురం సీటును ఆశిస్తున్న వీరశివారెడ్డి తనను రాజకీయంగా నిలబెట్టిన టీడీపీ వైపు చూస్తుండటం గమనార్హం.