Mekapati Goutham Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో 13 నామినేషన్ల తిరస్కరణ
- ఆత్మకూరు ఉప ఎన్నికలో 28 నామినేషన్ల దాఖలు
- పరిశీలనలో 13 నామినేషన్లను తిరస్కరించిన అధికారులు
- ఇంకా పోటీలో ఉన్నది 15 మంది మాత్రమే
- ఈ నెల 9తో ముగియనున్న ఉపసంహరణల గడువు
ఏపీలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో మొత్తంగా 28 నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం అధికారులు నామినేషన్ల పరిశీలనను చేపట్టారు. ఈ పరిశీలనలో ఏకంగా 13 నామినేషన్లు చెల్లనివిగా తేల్చిన అధికారులు వాటిని తిరస్కరించారు. ఫలితంగా బరిలో 15 నామినేషన్లు మాత్రమే ఉన్నట్లు తేలింది.
ఈ నెల 9న వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ గడువులోగా ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటే... వారిని ఎన్నికల అధికారులు పోటీ నుంచి తప్పిస్తారు. భారీ ఓట్ల మెజారిటీతో గెలవాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ... అందుకోసం ఏడుగురు మంత్రులను రంగంలోకి దింపింది. వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.