Monsoon: తెలంగాణలోకి ఈ నెల 9న ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
- గతేడాది జూన్ 6న వచ్చిన రుతుపవనాలు
- ఈసారి కేరళను ముందే తాకిన వైనం
- అనుకూల పరిస్థితులు లేకపోవడంతో మందగమనం
గతేడాది జూన్ 6న తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు జూన్ 9న లేదా, 10వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతు పవనాలు సకాలంలోనే వస్తున్నట్టు భావించాలని పేర్కొంది.
వాస్తవానికి, ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ముందుగానే (మే 29న) కేరళను తాకాయి. అయితే అక్కడ్నించి ముందుకు కదిలేందుకు అనుకూలతలు లేకపోవడంతో, వేగంగా విస్తరించలేకపోయాయి. ఎట్టకేలకు రుతుపవనాల్లో కదలిక ఏర్పడడంతో మరో రెండ్రోజుల్లో తెలంగాణను పలకరించనున్నాయి.
కాగా, ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది.