Gang Rape: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ జరిగిన తీరు, నిందితులకు పడే శిక్షపై సీపీ సీవీ ఆనంద్ చెప్పిన వివరాలివే!
- కేసులో మొత్తం నిందితులు ఆరుగురు
- వారిలో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు
- అత్యాచారానికి పాల్పడింది ఐదుగురే
- 20 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉందన్న సీపీ
హైదరాబాద్‌లో పెను కలకలం రేపిన మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్‌నకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.
ఆయన చెప్పిన ప్రకారం ఈ కేసు వివరాలు... బెంగళూరుకు చెందిన ఓ మైనర్ బాలుడు హైదరాబాద్‌లో తన మిత్రులకు ఓ పార్టీ ఇవ్వాలనుకున్నాడు. హైదరాబాద్‌లోని తన మిత్రులను అడిగి ఆమ్నేషియా పబ్‌లో పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను ఒక్కొక్కరికి రూ.1,200లు కట్టాలని పబ్ కోరితే... బేరమాడిన బాలురు ఒక్కొక్కరికి రూ.900 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే సమాచారాన్ని తమ మిత్రులకు సర్క్యులేట్ చేసుకుని ఒక్కొక్కరి వద్ద రూ.1,200 వసూలు చేశారు. బాధితురాలు కూడా రూ.1,300 కట్టి మరీ పార్టీకి హాజరైంది. మే 28న మధ్యాహ్నం పబ్‌లో పార్టీ మొదలైంది.
ఈ క్రమంలో పార్టీలో ఆమెతో ఈ కేసులో తొలి ముద్దాయిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ మాట కలిపాడు. అతడి కంటే ముందు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మరో మైనర్ కూడా ఆమెతో మాట కలిపాడు. ఈ క్రమంలో వారిద్దరూ బాధితురాలిని లైంగికంగా వేధించారు. ఈ వేధింపులు పెరిగిపోగా... తన స్నేహితురాలితో కలిసి బాధితురాలు బయటకు వెళ్లింది. పబ్‌లోనే సాదుద్దీన్‌తో కలిసి ఐదుగురు మైనర్లు ప్లాన్ వేసుకున్నారు. బయటకు వెళ్లిన బాధితురాలిని ఇద్దరు నిందితులు తమ బెంజ్ కారులో ఎక్కించుకుని బంజారా హిల్స్‌లోని ఓ బేకరీకి వెళ్లారు. వారిని అనుసరించి ఇన్నోవా కారులో మరో నలుగురు వెళ్లారు.
బేకరీ నుంచి బయటకు వచ్చాక ఆరుగురు నిందితులు బాధితురాలిని ఇన్నోవాలో ఎక్కించుకుని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వెనుక నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లారు. కారులో వెళుతుండగానే ఆమెపై నిందితులు బలాత్కారం చేశారు. తీరా తాము అనుకున్న ప్రాంతానికి చేరుకున్నాక బాధితురాలిపై ఆరుగురు నిందితులు వరుసగా అత్యాచారం చేశారు. ఈ సందర్భంగా వీడియోలు తీసుకున్నారు. వీడియోలను ఒకరితో మరొకరు షేర్ చేసుకున్నారు. అత్యాచారం తర్వాత బాధితురాలిని ఆమ్నేషియా పబ్ వద్దే వదిలివెళ్లారు. ఆ తర్వాత బాధితురాలు తన తండ్రిని పిలిపించుకుని ఇంటికెళ్లిపోయింది.
తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఆమె మెడపై అయిన గాయం చూసిన వారు మే 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా గ్యాంగ్ రేప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు.. మొత్తం ఐదుగురే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇద్దరు మేజర్లలో ఓ నిందితుడు కూడా మైనరేనని తేలింది.
అంతేకాకుండా బాధితురాలిపై అత్యాచారం చేసింది ఐదుగురే అయినా... కారులో ఆమెపై లైంగిక వేధింపులకు గురి చేసిన మరో మైనర్‌ను కూడా గుర్తించి అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ కేసులో నిందితులు ఆరుగురు ఉండగా.. వారిలో ఒక్కడే మేజర్. మిగిలిన ఐదుగురు మైనర్లేనని పోలీసులు తేల్చారు. మేజర్ సాదుద్దీన్ మాలిక్ కాగా... మైనర్లు అయినందున మిగిలిన ఐదుగురి పేర్లను వెల్లడించడం కుదరదని సీవీ ఆనంద్ తెలిపారు.
ఈ కేసులో గ్యాంగ్ రేప్ సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో నిందితులకు మూడు రకాల శిక్షలు పడే అవకాశముందని కమిషనర్ చెప్పారు. 20 ఏళ్ల జైలు శిక్ష, లేదంటే జీవించి ఉన్నంత కాలం పాటు జైలు శిక్ష, లేదంటే ఉరి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. అత్యాచారానికి పాల్పడని నిందితుడికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.
ఇక ఈ కేసులో ఐదుగురు నిందితులు మైనర్లే కావడంతో వారు ఎవరన్న విషయాన్ని చెప్పడం కుదరదని కూడా సీపీ చెప్పారు. వెరసి నిందితుల్లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడా? లేదా? అన్నది తాము చెప్పలేమని తెలిపారు. ఈ కేసులో హోం మంత్రి మనవడు ఉన్నాడని చాలా మంది ఆరోపించారని, అయితే తమకేమీ ఆ దిశగా ఆధారాలు దొరకలేదని ఆయన తెలిపారు. సదరు ఆధారాలు ఏవైనా ఉంటే తమకివ్వాలని, ఆ ఆధారాలు నిజమని తేలితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కూడా కమిషనర్ చెప్పారు.