Hyderabad: భాగ్యనగరిలో ఇకపై ఇష్టానుసారం హారన్లు మోగిస్తే కఠిన చర్యలే!
- ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద అవసరం లేకున్నా హారన్ల మోత
- ఫలితంగా భారీగా పెరిగిపోతున్న శబ్ద కాలుష్యం
- అనవసర హారన్లను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసుల చర్యలు
- కెమెరాలతోనే హారన్ మోతలు గుర్తించేందుకు రంగం సిద్ధం
- అనవసర హారన్లకు జరిమానా సహా కోర్టులో హాజరయ్యేలా శిక్షలు
- మరో నెలలోనే హైదరాబాద్‌లో సరికొత్త ట్రాఫిక్ రూల్స్
భాగ్య నగరి హైదరాబాద్‌లో అంతకంతకూ వాహనాల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా పెరిగిపోతోంది. వాయు కాలుష్యం తగ్గించేందుకు చేపడుతున్న చర్యలు ఓ మోస్తరు ఫలితం ఇస్తున్నా.. శబ్ద కాలుష్యం తగ్గించడంలో మాత్రం అనుకున్న మేర ఫలితాలు రావడం లేదు. దీంతో నగర ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం ఇప్పుడు కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నిబంధనలు మరో నెలలోనే అందుబాటులోకి రానున్నట్లు నగర ట్రాఫిక్ పోలీస్ చీఫ్ ఏవీ రంగనాథ్ చెబుతున్నారు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం అనవసరంగా హారన్ కొట్టే వారిని అత్యాధునిక కెమెరాల సాయంతో పోలీసులు గుర్తించనున్నారు. అనవసర హారన్ మోతాదును బట్టి వాహనదారుడిపై చర్యలు తీసుకుంటారు. ఈ చర్యల కింద జరిమానాలు, భారీ జరిమానాలు విధించడంతో పాటు ఏకంగా వాహనదారులను కోర్టులో హాజరుపరిచే దాకా శిక్షలు ఉన్నాయి. ఈ మేరకు మోటారు వాహనాల చట్టంలోని 119 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
వాస్తవానికి వాహనాల శబ్ద కాలుష్యాన్ని కొలిచేందుకు ఇప్పటికే నగరంలో జపాన్ సాంకేతికతతో తయారైన కెమెరాలను పోలీసులు వినియోగిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో ఇప్పటికే వీటిని ఏర్పాటు చేశారు కూడా. అయితే ఆయా వాహనాల నుంచి వచ్చే శబ్దాన్ని గుర్తించి ఆయా వాహనాల నెంబర్లను స్కాన్ చేస్తూ ఆ వివరాలను కమాండ్ కంట్రోల్‌కు పంపడం ఈ కెమెరాలతో సాధ్యం కావడం లేదు.
దీంతో సదరు కెమెరాలను మరింతగా అభివృద్ధి చేసే దిశగా జపాన్ సంస్థను ట్రాఫిక్ పోలీసులు సంప్రదించారు. అందుకు ఆ కంపెనీ కూడా ఓకే చెప్పిందట. ఇంకో నెలలో అభివృద్ధి చేసిన కెమెరాలు ట్రాఫిక్ పోలీసులకు అందనున్నాయి. ఇవి అందగానే... నగరంలో అనవసరంగా హారన్ మోగించే వారిని గుర్తించి శిక్షలు అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.