RBI: రుణ గ్రహీతలకు షాక్.. ఫిక్స్ డ్ డిపాజిటర్లకు గుడ్ న్యూస్
- రెపో రేటును అర శాతం పెంచిన ఆర్బీఐ
- రుణ ఈఎంఐలపై అదనపు భారం
- ఫిక్స్ డ్ డిపాజిట్లపై పెరగనున్న ఆదాయం
భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) రెపో రేటును అర శాతం పెంచడం వల్ల రుణాలు తీసుకున్న వారిపై మరింత భారం పడనుంది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలు పెరిగేందుకు దారితీయనుంది. నెలక్రితమే ఆర్బీఐ రెపో రేటును 0.40 శాతం మేర పెంచడం తెలిసిందే. అంటే నెల రోజుల వ్యవధిలోనే కీలక రేటును 0.90 శాతం పెంచడాన్ని గమనించాలి. తాజాగా రెపో రేటు 4.90 శాతానికి చేరింది.
వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ఈ రేటుకు బ్యాంకులు తమ మార్జిన్, రిస్క్ కలుపుకుని రుణాలపై రేట్లను ప్రకటిస్తుంటాయి. ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పుడల్లా బ్యాంకులు గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై రేట్లను సవరిస్తుంటాయి. దీంతో ఈఎంఐ పెరగడం లేదంటే రుణ కాలవ్యవధి పెరగడం జరుగుతుంది.
ఎంత పెరగొచ్చు..?
రూ.30 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 7 శాతం వడ్డీ రేటుపై తీసుకుంటే.. తాజా పెంపు తర్వాత ఈఎంఐ రూ.1,648 పెరగనుంది. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.23,259 నుంచి రూ.24,907గా అవుతుంది. ఒకవేళ వాహన రుణం రూ.8 లక్షలను 7 ఏళ్ల కాలానికి 10 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుంటే.. నెల రోజుల్లో 0.90 శాతం పెరగడం వల్ల ఈఎంఐ రూ.375 పెరుగుతుంది. అలాగే, రూ.5 లక్షల వ్యక్తిగత రుణాన్ని 5 ఏళ్ల కాలానికి తీసుకున్నారని అనుకుంటే వడ్డీ రేటు 14 శాతం నుంచి 14.9 శాతానికి పెరగడం వల్ల ఈఎంఐ రూ.235 మేర పెరగనుంది.
ఇక ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7 శాతం దిగువనకు తగ్గిపోవడంతో.. ఇప్పటి వరకు వృద్ధాప్యంలో డిపాజిట్లపైనే ఆధారపడిన వారిని నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. తాజా పెంపు తర్వాత డిపాజిట్లపైనా ఒక శాతం వరకు అదనపు రాబడికి అవకాశం ఏర్పడింది.