sexual health educators: పాఠశాలల్లో లైంగిక ఆరోగ్య బోధకులు.. కర్ణాటకలో ప్రతిపాదన
- ముసాయిదా యూత్ పాలసీలో ప్రతిపాదన
- దీనిపై భాగస్వాముల నుంచి అభిప్రాయాలకు ఆహ్వానం
- పలు సంస్థల నుంచి వ్యతిరేకత
- భారతీయ విలువలకు వ్యతిరేకమన్న వాదన
కర్ణాటక సర్కారు నూతన యూత్ పాలసీ 2022లో పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యానికి సంబంధించి బోధకుల నియామకాన్ని ప్రతిపాదించింది. విద్యార్థులకు వీరు లైంగిక విజ్ఞానం, పునరుత్పాదక అవయవాల పనితీరు, ఆరోగ్యంపై బోధించనున్నారు. కానీ, పలు సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. పాఠశాలల్లో లైంగిక, పునరుత్పాదక అవయవాల ఆరోగ్యంపై బోధనలు.. భారత విలువలకు వ్యతిరేకమని వాదిస్తున్నాయి.
నిజానికి 2007లోనూ కర్ణాటక సర్కారు పాఠశాలల్లో లైంగిక అంశాలపై బోధనలను ప్రవేశపెట్టాలని అనుకుంది. వివిధ సంఘాలు, వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. కర్ణాటక ప్రతిపాదిస్తున్న సదరు ముసాయిదా పాలసీ ఇంకా చట్ట సభల్లో ఆమోదం పొందలేదు. దీనిపై రాష్ట్ర సర్కారు అభిప్రాయాలకు ఆహ్వానం పలికింది.
టీనేజీలో బాల, బాలికలు శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని.. ఆహార అలవాట్లు, శారీరక చర్యలు, డ్రగ్స్ కు బానిసలు కావడం వంటి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నట్టు ఈ ముసాయిదా బిల్లులో ప్రభుత్వం పేర్కొంది.