BL Santosh: వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెవరిచ్చారు?: ఏపీ ప్రభుత్వంపై బీఎల్ సంతోష్ ఫైర్
- అమలాపురం వెళ్లాలనుకున్న సోము వీర్రాజు
- అడ్డుకున్న పోలీసులు
- ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్
- రాష్ట్రంలో అసమర్థ పాలన ఉందంటూ విమర్శలు
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును అమలాపురం వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ స్పందించారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెవరిచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అడుగడుగునా ఆంక్షలతో పోలీసుల భద్రత మధ్య రాష్ట్రాన్ని ఎంతకాలం పాలిస్తారని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని, ఉద్రిక్త పరిస్థితులకు కారణం కాబోమని ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలెందుకని బీఎల్ సంతోష్ మండిపడ్డారు.
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తుంటే పోలీసు శాఖ ద్వారా ఈ దుందుడుకు చర్యలు ప్రభుత్వ అసమర్థ పాలనను బయటపెడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థాయిలో రాష్ట్ర పాలన దిగజారిందనే విషయానికి ఈ చర్యలు అద్దంపడుతున్నాయని బీఎల్ సంతోష్ పేర్కొన్నారు.