Saturday: పాకిస్థాన్ లో ఇక ప్రతి శనివారం సెలవే.. ఎందుకంటే..!
- పాక్ లో గతంలోనూ శనివారం సెలవు
- ఇటీవల పాక్ లో తీవ్ర ఇంధన కొరత
- విపరీతంగా విద్యుత్ కోతలు
- తాజాగా శనివారం సెలవును పునరుద్ధరించిన ప్రభుత్వం
ఇటీవలే పాకిస్థాన్ లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, పీకల్లోతు సమస్యలు స్వాగతం పలికాయి. వాటిలో ముఖ్యమైనది దేశంలో ఇంధన కొరత. పాకిస్థాన్ లో ప్రస్తుతం కరెంటుకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న విధంగానే శనివారాన్ని సెలవు దినంగా పునరుద్ధరించింది. తద్వారా విద్యుత్, ఇంధనం పెద్ద ఎత్తున ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు విద్యుత్ ఆదా చేసేందుకు శనివారాన్ని పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. గతంలోనూ ఈ విధానం అమల్లో ఉండేది. దీన్ని మళ్లీ అమల్లోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.
దీనిపై పాక్ సమాచార ప్రసార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ మాట్లాడుతూ, శనివారాన్ని సెలవు దినంగా పునరుద్ధరించడం వల్ల సాలీనా 386 మిలియన్ డాలర్లు ఆదా అవుతుందని, 77 బిలియన్ డాలర్ల మేర దిగుమతి రంగానికి ఊరట కలుగుతుందని వివరించారు. అంతేకాకుండా, శుక్రవారాన్ని వర్క్ ఫ్రం హోం దినంగా ప్రకటించాలని ఇంధన రంగం సిఫారసు చేసిందని, ఒక్కరోజు ప్రజలు ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల ఎంతో ఇంధనం ఆదా అవుతుందని వివరించారు.
అయితే, ఈ సిఫారసు సాధ్యాసాధ్యాలపై ప్రధాని షాబాజ్ షరీఫ్ ఓ కమిటీ ఏర్పాటు చేశారని మరియం ఔరంగజేబ్ తెలిపారు. దాంతోపాటు, మార్కెట్లను వీలైనంత త్వరగా మూసివేయడం వల్ల కూడా విద్యుత్ ఆదా చేయవచ్చన్న ప్రతిపాదనలు క్యాబినెట్ సమావేశంలో తెరపైకి వచ్చాయని వివరించారు.