India: పర్యావరణ కృషి జాబితాలో భారత్ కు అట్టడుగు స్థానం... జాబితా రూపకర్తలపై మండిపడిన కేంద్రం
- పర్యావరణ పనితీరు జాబితా విడుదల
- జాబితా రూపొందించిన కొలంబియా వర్సిటీ
- భారత్ కు దారుణమైన ర్యాంకు
పర్యావరణ కృషి సూచిక-2022లో భారత్ అట్టడుగున నిలిచింది. 180 దేశాలతో ఈ జాబితా రూపొందించారు. ఈ జాబితాలో దేశానికి దారుణమైన ర్యాంకు లభించడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊహాజనిత అంశాల ఆధారంగా, అశాస్త్రీయమైన పద్ధతుల్లో ఈ జాబితా రూపొందించారంటూ సదరు ఇండెక్స్ సృష్టికర్తలపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మండిపడింది.
ఈ జాబితాను ఇటీవలే కొలంబియా యూనివర్సిటీ రూపొందించింది. వాతావరణ మార్పుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, పర్యావరణ ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థకు ఇస్తున్న ప్రాధాన్యత తదితర 40 అంశాల ఆధారంగా 11 కేటగిరీల్లో పరిశీలన జరిపి ఈ జాబితా రూపొందించారు.
అయితే, పర్యావరణ రంగంలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న వివిధ కేటగిరీలను సదరు ఇండెక్స్ రూపకర్తలు పరిగణనలోకి తీసుకోలేదని, వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలేదని కేంద్రం ఆరోపించింది. నీటి నాణ్యత, నీటి వినియోగ సమర్థత, సుస్థిర వినియోగంతో పాటు ఉత్పాదకతకు దగ్గరి సంబంధం ఉన్న తలసరి వ్యర్థాల ఉత్పత్తి తదితర అంశాలకు సూచికలో చోటు కల్పించలేదని వివరించింది. అన్నీ కంప్యూటర్ ఆధారిత అంచనాలతో జాబితా రూపొందించినట్టుగా ఉందని విమర్శించింది.
ఈ జాబితాలో భారత్ లో కు లభించిన స్కోరు 18.9 పాయింట్లు కాగా... జాబితాలో చివరిదైన 180వ స్థానంలో నిలిచింది. భారత్ కంటే పైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్ ఉన్నాయి.