Revanth Reddy: అత్యాచారాల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు కొనసాగుతున్నట్టుంది: రేవంత్ రెడ్డి వ్యంగ్యం
- అత్యాచార ఘటనపై రేవంత్ ప్రెస్ మీట్
- వాహనాల యజమానులు ఎవరంటూ ప్రశ్నించిన వైనం
- సీవీ ఆనంద్ చాలా విషయాలు దాస్తున్నారని ఆరోపణ
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసులో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నందున నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందా? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలని పేర్కొన్న రేవంత్... ఈ రెండు పార్టీల పొత్తు అత్యాచారాల్లోనూ కొనసాగుతున్నట్టుంది అని వ్యంగ్యం ప్రదర్శించారు.
కాగా, అత్యాచార ఘటనలో ఉపయోగించిన బెంజ్ కారు, ఇన్నోవా వాహనం ఎవరివో ఎందుకు బయటపెట్టడంలేదని నిలదీశారు. నిందితులు మైనర్లు అని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారని, మరి మైనర్లకు కార్లు ఇచ్చిన వాహన యజమానులపై ఎందుకు కేసు పెట్టడంలేదన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానులపై కేసు నమోదు చేయాలని మోటారు వాహనాల చట్టం చెబుతోందని రేవంత్ పేర్కొన్నారు. ఒకవేళ ఈ కేసులో మోటారు వాహనాల చట్టం వీలుకాకపోతే, 16 ఆఫ్ పోక్సో చట్టాన్ని వర్తింపజేయాలని అన్నారు.
అసలు, మే 28వ తేదీన ఘటన జరిగితే జూన్ 4న ఇన్నోవా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఇన్ని రోజుల పాటు ఆ వాహనం ఎక్కడుందని ప్రశ్నించారు. కారుపై ప్రభుత్వ వాహనం అని ఉన్న స్టిక్కర్ తొలగించింది ఎవరని నిలదీశారు. సీవీ ఆనంద్ చాలా విషయాలు వెల్లడించకుండా దాచినట్టు భావిస్తున్నామని రేవంత్ తెలిపారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని స్పష్టం చేశారు.