New Delhi: హోం వర్క్ చేయలేదని.. ఐదేళ్ల కుమారుడి కాళ్లు, చేతులు కట్టేసి మండుటెండలో మిద్దెపై పడేసిన తల్లి!
- హృదయవిదారకంగా బాలుడి ఆర్తనాదాలు
- వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన పక్కింటి వ్యక్తి
- బాలుడి తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్
- బాలుడి కుటుంబాన్ని గుర్తించామన్న పోలీసులు
హోం వర్క్ చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి తన ఐదేళ్ల కుమారుడిపై కర్కశంగా వ్యవహరించింది. బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి మిట్టమధ్యాహ్నం ఇంటి మిద్దెపై వదిలేసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎండవేడిమికి తాళలేక బాలుడు పెడుతున్న ఆర్తనాదాలు నెటిజన్లతో కన్నీళ్లు తెప్పించాయి. బాలుడు ఒకటో తరగతి చదువుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని టుకుమీర్‌పూర్‌లో వీరి కుటుంబం నివసిస్తోంది.
మిద్దెపై నుంచి బాలుడి ఏడుపులు వినిపిస్తుండడంతో చూసిన పక్కింటి వారు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్‌కు ట్యాగ్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆ తల్లిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శారీరక దండన పిల్లల స్వేచ్ఛ, గౌరవానికి సంబంధించిన హక్కును దుర్వినియోగం చేస్తుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చెబుతోంది. 14 ఏళ్ల వరకు పిల్లల విద్యాహక్కుతోపాటు జీవించే హక్కును, గౌరవాన్ని ఇది పరిరక్షిస్తుంది. అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(E) పిల్లల లేత వయసు దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటుంది. వీటితోపాటు పిల్లల స్వేచ్ఛను రక్షించేందుకు రాజ్యాంగంలో పలు సెక్షన్లు ఉన్నాయి. కాగా, వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు బాలుడి తల్లిపై కేసు నమోదు చేశారు. బాధిత బాలుడి కుటుంబాన్ని గుర్తించామని, బాలుడి తల్లిపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.