Chandrababu: జిల్లాల పర్యటనకు చంద్రబాబు.. 15న అనకాపల్లి నుంచి ప్రారంభం
- ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటన ఉండేలా ప్రణాళిక
- మొదటి రోజు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన
- ఒక్కో పర్యటనలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల సందర్శన
- ఏడాదిలో 80కిపైగా నియోజకవర్గాలు పూర్తి చేసేలా ప్రణాళిక
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉన్న తెలుగుదేశం పార్టీ అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వరకు ప్రజల్లో ఉండాలని భావిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించాలని నిర్ణయించారు. నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాదిలో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ పర్యటన పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి జిల్లాలోనూ మూడు రోజులపాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 15న అనకాపల్లి నుంచి పర్యటన ప్రారంభం కానుంది.
మొదటి రోజు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ జిల్లా మహానాడు నిర్వహిస్తారు. రెండోరోజు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశం అవుతారు. మూడో రోజు ఆ జిల్లాలో లేదంటే సమీప జిల్లాల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి ప్రజా సమస్యలను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా రోడ్ షో కూడా నిర్వహిస్తారు. ఒక్కో పర్యటనలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శిస్తారు. మొత్తంగా ఏడాదిలో 80కిపైగా నియోజకవర్గాలను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది.
అలాగే, ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాల సందర్భంగా ప్రతి జిల్లాలో మహానాడు సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. తాజాగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 15న చోడవరంలో అనకాపల్లి జిల్లా మహానాడు సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 16న అనకాపల్లిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. 17న విజయనగరం జిల్లా పరిధిలోని చీపురుపల్లి, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి సమస్యల పరిశీలన, రోడ్‌షోలు ఉంటాయి.