CPI Narayana: లక్ష్మణ రేఖ దాటుతున్నారు.. గవర్నర్ తమిళిసైపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

CPI Narayana Criticizes Governor On Mahila Darbar

  • ‘మహిళా దర్బార్’ ఎందుకంటూ నిలదీత
  • వెంటనే రద్దు చేయాలని డిమాండ్
  • టీఆర్ఎస్ సర్కార్ పై పోరాడుతున్నామని వెల్లడి

తెలంగాణ గవర్నర్ తమిళిసైపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె లక్ష్మణ రేఖ దాటుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో గవర్నర్ రేపు రాజ్ భవన్ లో మహిళా దర్బార్ కార్యక్రమం నిర్వహించతలపెట్టిన సంగతి తెలిసిందే. దానిపైనే నారాయణ విమర్శలు గుప్పించారు. మహిళా దర్బార్ కార్యక్రమం అసలు ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నించారు. ఆ కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ దాడిని పెంచిందని, దానికి తోడు గవర్నర్ పాత్ర అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ విధానాలపై సీపీఐ తరఫున పోరాడుతున్నామని, మైనర్లను పబ్ లోకి అనుమతించడం నేరమని అన్నారు. మైనర్లను అనుమతించిన పబ్ ఓనర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. పబ్ ను సీజ్ చేసి ఓనర్ ను అరెస్ట్ చేయాలన్నారు. 

కాగా, మహిళా దర్బార్ కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు గవర్నర్ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 040–23310521కు ఫోన్ చేయవచ్చు. [email protected] అనే మెయిల్ ద్వారా కూడా అనుమతి తీసుకోవచ్చు.

  • Loading...

More Telugu News