Kshama Bindu: తగ్గేదేలేదు.. తనను తాను పెళ్లి చేసుకున్న గుజరాతీ యువతి క్షమాబిందు

Kshama Bindu puts lid on her cause celebre weds herself

  • వరుడు లేడు.. పురోహితుడూ లేడు
  • కానీ, పెళ్లి మాత్రం జరిగింది
  • సంప్రదాయబద్ధంగా పెళ్లి ముచ్చట తీర్చుకున్న యువతి
  • ఇతర వధువుల్లా పెళ్లి తర్వాత ఇంటిని వీడక్కర్లేదని ప్రకటన

తనను తానే పెళ్లి చేసుకుంటానంటూ ప్రకటించిన గుజరాతీ యువతి క్షమాబిందు.. అన్నంతపనీ చేసింది. ఘనంగా, సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకుంది. దేశంలో తొలి సోలోగమీ ఇదే. వాస్తవానికి ఆమె జూన్ 11న పెళ్లి ముహూర్తం పెట్టుకుంది. కానీ, ఆమె వివాహం పెద్ద చర్చ, వివాదానికి దారితీయడంతో.. దీనికి ముగింపు పలకాలని ఈ నెల 8న బుధవారమే వివాహ కార్యక్రమాన్ని తన స్వస్థలం గోత్రిలో ముగించేసింది. 

కానీ, ప్రకృతి విరుద్ధమైన పెళ్లి జరిపించేందుకు ఒక్క పురోహితుడు కూడా ముందుకు రాలేదు. తొలుత ఆలయంలో వివాహ కార్యక్రమం ఉంటుందని క్షమాబిందు ప్రకటించినప్పటికీ, ఇంట్లోనే చేసుకుంది. హిందూ మతంలో ఒకరు తనను తానే పెళ్లి చేసుకోవడం కుదరదని, ఈ వివాహాన్ని ఆలయంలో జరగనీయబోమని స్థానిక బీజేపీ నేత సునీత శుక్లా సైతం హెచ్చరించడం గమనార్హం. 

తాను వధువుగా మారాలని అనుకుంటున్నానే కానీ, ఒకరికి భార్యగా కాదని క్షమాబిందు లోగడ స్పష్టం చేసింది. సింధూ వర్ణ చీర కట్టి, మెడలో పూలదండ ధరించి, హారాలు వేసుకుని, చేతులు, కాళ్లకు మెహెందీ డిజైన్లు దిద్దుకుని, చిరునవ్వులు చిందిస్తూ.. అద్దంలో తనను తానే ముద్దాడి క్షమాబిందు తన ముచ్చటలన్నీ తీర్చుకుంది. మెడలో మంగళసూత్రం కూడా ధరించింది. 40 నిమిషాల పాటు పెళ్లి వేడుక కొనసాగింది. పెళ్లి బట్టల కోసం తానే స్వయంగా షాపింగ్ చేసింది. 

ఒక్క పురోహితుడు, వరుడు లేని లోటు కనిపించింది తప్ప.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అచ్చమైన పెళ్లే మాదిరే నడిచింది. ఇతర వధువుల్లా తాను పెళ్లి తర్వాత తన ఇంటిని విడిచి వెళ్లాలని అనుకోవడం లేదని క్షమాబిందు చెప్పింది. 

  • Loading...

More Telugu News