Supreme Court: మరో రౌండ్ కౌన్సెలింగ్ కు అనుమతించేది లేదు: మిగిలిపోయిన నీట్ పీజీ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు
- మిగిలిపోయింది నాన్ క్లినికల్ కోర్సుల సీట్లే
- 40 వేల సీట్లకు మిగిలింది 1,456 మాత్రమే
- అలాంటప్పుడు కొత్తగా ఇంకో రౌండ్ కౌన్సెలింగ్ ఎందుకన్న సుప్రీం
- దాని వల్ల విద్యాసంవత్సరం ఆలస్యమవుతుందన్న అత్యున్నత న్యాయస్థానం
మిగిలిపోయిన నీట్ పీజీ సీట్ల భర్తీ కోసం మరో రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్న అభ్యర్థుల విన్నపాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దానిపై దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. నీట్ పీజీ అడ్మిషన్లకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో 1,456 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి.
అయితే, వాటిని భర్తీ చేయాలంటూ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఇవాళ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ ల వెకేషన్ బెంచ్ విచారించింది. ఇప్పటికే తొమ్మిది రౌండ్ల కౌన్సెలింగ్ ముగిసిందని, ఇంకో రౌండ్ కౌన్సెలింగ్ కు అనుమతించేది లేదని, అలా చేస్తే విద్యా సంవత్సరం ఆలస్యమవుతుందని వ్యాఖ్యానించింది.
పిటిషనర్లు నాన్ క్లినికల్ (డాక్టర్ ప్రాక్టీస్ కు ఉపయోగపడని) సీట్ల కోసమే మరో రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలంటున్నారని, కానీ, టైంకు ప్రవేశాలను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్న విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకున్నామని జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. కాబట్టి మరో రౌండ్ కౌన్సెలింగ్ కు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
వైద్య విద్య నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని, దాని వల్ల ప్రజారోగ్యంపై పెను ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పారు. మొత్తం 40 వేల సీట్లకు కౌన్సెలింగ్ జరిగితే 1,456 సీట్లు మాత్రమే మిగిలాయన్నారు. అలాంటప్పుడు మళ్లీ కౌన్సెలింగ్ ఎందుకని ప్రశ్నించారు. అభ్యర్థుల వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందన్నారు.
కాగా, కౌన్సెలింగ్ లో అనాటమీ, బయాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో మాత్రమే సీట్లు మిగిలిపోయాయని, అవి కేవలం టీచింగ్ కోసమే పనికొస్తాయని, ఆ సబ్జెక్ట్ వల్ల డాక్టర్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టే చాలా మంది వాటిని తీసుకోలేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది. మిగిలిపోయిన సీట్ల భర్తీకి మరో రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే నీట్ పీజీ 2022 కౌన్సెలింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగే ఆస్కారం ఉందని, ఇప్పటికే స్టూడెంట్ల సెక్యూరిటీ డిపాజిట్ రిఫండ్ ప్రక్రియనూ మొదలు పెట్టేశామని చెప్పింది.