Telangana: గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
- అది ప్రజా దర్బార్ కాదు.. పొలిటికల్ దర్బార్ అన్న ఎమ్మెల్యే వివేకానంద
- గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శ
- గవర్నర్ లక్ష్మణ రేఖ దాటినా సహనంతో ఉంటున్నామని వ్యాఖ్య
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం రాజ్ భవన్ వేదికగా మహిళా దర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకు అందిన ఫిర్యాదులను పరిశీలించిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాజ్‌భవన్‌ను గౌరవించాలని కూడా ఆమె ప్రభుత్వానికి సూచించారు.
రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ ముగిసిందో, లేదో.. ఆ కార్యక్రమంపై అధికారి టీఆర్ఎస్ విరుచుకుపడింది. ఆ పార్టికి చెందిన ఎమ్మెల్యే వివేకానంద గవర్నర్ మహిళా దర్బార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ నిర్వహించింది ప్రజా దర్బార్ కాదన్న ఆయన అది పొలిటికల్ దర్బారేనని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటినా కూడా తాము సహనంతోనే ఉంటున్నామని కూడా ఆయన వ్యాఖ్యానించారు.