Gold: నాడు బ్రిటిష్ వాళ్లు ముంచేసిన నౌకల్లో లక్ష కోట్ల సంపద గుర్తింపు!
- 1708లో స్పెయిన్ నౌక శాన్ జోస్ ను ముంచేసిన బ్రిటన్
- 2015లో నౌక శిథిలాల గుర్తింపు
- తాజాగా అదే ప్రాంతంలో మరో రెండు నౌకల శిథిలాలు
- నౌకల నిండా బంగారమే!
మూడు వందల ఏళ్ల కిందట బ్రిటిష్ వాళ్లు సముద్రంలో ముంచేసిన ఓ నౌక వద్ద తాజాగా మరో రెండు నౌకలు మునిగిపోయిన స్థితిలో గుర్తించారు. కాగా, ఆ రెండు నౌకల్లో కళ్లు చెదిరే రీతిలో అత్యంత విలువైన సంపద ఉన్నట్టు వెల్లడైంది. 1708లో బ్రిటన్ సైన్యం శాన్ జోస్ అనే యుద్ధ నౌకను ముంచేసింది. 62 ఫిరంగులతో ఆ రోజుల్లో శాన్ జోస్ గొప్ప యుద్ధ నౌకగా పేరుగాంచింది. ఇది స్పెయిన్ నేవీకి చెందినది.
కాగా, మునిగిపోయిన ఈ నౌకను కొలంబియా వద్ద కరీబియన్ సముద్ర జలాల్లో 2015లో గుర్తించారు. అయితే, తాజాగా ఈ నౌక మునిగిపోయిన ప్రాంతం వద్ద మరో రెండు నౌకలు కూడా మునిగిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు నౌకల నిండా ఉన్న బంగారం విలువ అంతాఇంతా కాదు... ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం రూ.1.27 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ రెండు నౌకలకు చెందిన ఫుటేజిని స్పెయిన్ ప్రభుత్వం విడుదల చేసింది. సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతున ఉన్న ఆ శిథిల నౌకల వద్దకు రిమోట్ కంట్రోల్ తో నడిచే ఓ వాహనాన్ని పంపి పరిశీలించారు. ఈ నౌకలు 200 ఏళ్ల నాటివి అయ్యుంటాయని భావిస్తున్నారు. గుట్టలు గుట్టలుగా ఉన్న బంగారు నాణేలు, ఇతర ఉపకరణాలు, పోర్సలిన్ కప్పులు దర్శనమిచ్చాయి. కాగా, ఆ నౌకల్లో లభ్యమైన ఫలకాలపై ఉన్న లిపి ఆధారంగా ఆ నౌకల వివరాలు తెలుసుకునేందుకు నేవీ, ప్రభుత్వ పురావస్తు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.