Manoj Tiwary: రంజీ ట్రోఫీలో సెంచరీ బాదిన బెంగాల్ క్యాబినెట్ మంత్రి
- బెంగాల్, ఝార్ఖండ్ మధ్య రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్
- బెంగళూరులో మ్యాచ్
- 129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్
- సెంచరీతో సత్తా చాటిన మనోజ్ తివారీ
పశ్చిమ బెంగాల్ క్రికెటర్, రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి మనోజ్ తివారీ రంజీ ట్రోఫీలో మరోసారి సత్తా చాటాడు. ఝార్ఖండ్ తో బెంగళూరులో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ లో మనోజ్ తివారీ అద్భుతంగా ఆడి సెంచరీ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 152 బంతుల్లో శతకం సాధించాడు. అతడి స్కోరులో 14 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
బెంగాల్ రెండో ఇన్నింగ్స్ లో 129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బరిలో దిగిన మనోజ్ తివారీ ఐదో వికెట్ కు అభిషేక్ పోరెల్ తో కలిసి 72 పరుగులు జోడించాడు. కాగా, 136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తివారీ రనౌట్ అయ్యాడు.
ఇక ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా, భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో బెంగాల్ మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 773 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఝార్ఖండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 298 పరుగులకే ఆలౌట్ కాగా, బెంగాల్ జట్టుకు 475 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బెంగాల్ 7 వికెట్లకు 318 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి సమయం పూర్తికావడంతో మ్యాచ్ డ్రా అయినట్టు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లోనూ మనోజ్ తివారీ 73 పరుగులతో రాణించడం విశేషం.
36 ఏళ్ల మనోజ్ తివారీ గత ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. హౌరాలోని షిబ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. క్రికెటర్ కావడంతో అతడికి మమతా బెనర్జీ క్రీడల శాఖ అప్పగించారు. మనోజ్ తివారీ గతంలో టీమిండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. భారత జట్టు తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, ఒక ఫిఫ్టీ నమోదు చేయడం విశేషం.