Pakistan: ముషారఫ్ ఆరోగ్యంపై ఆయన కుటుంబం స్పందన ఇదే
- ముషారఫ్ వెంటిలేటర్‌పై కూడా లేరన్న కుటుంబ సభ్యులు
- అమిలోడోసిస్ తీవ్రం కావడంతో 3 వారాలుగా చికిత్స పొందుతున్నారని వివరణ
- చికిత్సతో రికవరీ అయ్యే అవకాశాలు లేవని వెల్లడి
- అవయవాలు కూడా సరిగా పనిచేయడం లేదన్న కుటుంబ సభ్యులు
- ముషారఫ్ కోసం ప్రార్థించండి అంటూ ప్రకటన
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు, కాదు, వెంటిలేటర్‌పై ఉన్నారంటూ మరికొన్ని వార్తా సంస్థలు ఇస్తున్న వార్తలపై ఆయన కుటుంబం తాజాగా స్పందించింది. ముషారఫ్ వెంటిలేటర్‌పై కూడా లేరని, కేవలం ఆయన ఆసుపత్రిలో చికిత్స మాత్రమే పొందుతున్నారని ఆయన కుటుంబం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ట్విట్టర్ వేదికగా ముషారఫ్ కుటుంబం ఓ ట్వీట్ చేసింది.
ముషారఫ్ అమిలోడోసిస్ సమస్య తీవ్రతరం కావడంతో గడచిన మూడు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కుటుంబం తెలిపింది. రికవరీ అసాధ్యమైన చికిత్సలోనే ముషారఫ్ ఉన్నారని, ఆయన అవయవాలు కూడా సరిగా పని చేయడం లేదని తెలిపింది. ముషారఫ్ కోలుకోవాలని దయచేసి ప్రార్థనలు చేయండని కూడా ఆయన కుటుంబ సభ్యులు కోరారు.