Amazon: ఐపీఎల్ ప్రసార హక్కుల రేసు నుంచి అమెజాన్ ఔట్... ఉరకలేస్తున్న వయాకామ్ 18
- ఐపీఎల్ హక్కుల కోసం తీవ్రస్థాయిలో పోటీ
- బెజోస్ వర్సెస్ అంబానీ అంటూ ప్రచారం
- చివరి నిమిషంలో అమెజాన్ కీలక నిర్ణయం
- 2023-27 కాలావధికి గాను తాజా బిడ్డింగ్
ప్రపంచ కుబేరులు జెఫ్ బెజోస్, ముఖేశ్ అంబానీ మధ్య పోటీగా వ్యాపార వర్గాలు భావించిన ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్లలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ రేసు నుంచి జెఫ్ బెజోస్ కు చెందిన అమెజాన్ సంస్థ వైదొలగింది. ఐపీఎల్ మీడియా హక్కుల బిడ్డింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానున్న తరుణంలో అమెజాన్ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో... ఐపీఎల్ టీవీ, డిజిటల్ హక్కుల రేసులో రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ అతిపెద్ద పోటీదారుగా కనిపిస్తోంది. అయితే, వయాకామ్ కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన అమెజాన్ చివరి నిమిషంలో ఎందుకు తప్పుకుందన్నది తెలియరాలేదు. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు.
"అవును... అమెజాన్ సంస్థ పోటీ నుంచి తప్పుకుంది. ఇవాళ నిర్వహించిన టెక్నికల్ బిడ్డింగ్ ప్రక్రియలో అమెజాన్ ప్రతినిధులు పాల్గొనలేదు. ఇక, గూగుల్ (యూట్యూబ్) కూడా దీనిపై ఆసక్తి చూపుతూ బిడ్ డాక్యుమెంట్ తీసుకున్నా, ఎందుకనో ఆ డాక్యుమెంట్ ను తిరిగి సమర్పించలేదు. టీవీ, స్ట్రీమింగ్ హక్కుల రేసులో ఇప్పటివరకు 10 సంస్థలు మిగిలాయి" అని వివరించారు.
ఐపీఎల్ లో వచ్చే ఐదేళ్ల కాలానికి, అంటే 2023 నుంచి 2027 వరకు టెలివిజన్, డిజిటల్ కంటెంట్ ప్రసార హక్కుల కోసం బీసీసీఐ ఈ బిడ్డింగ్ నిర్వహిస్తోంది. ఈ ఐదేళ్లలో తొలి మూడేళ్ల పాటు 74 మ్యాచ్ లు, చివరి రెండేళ్లలో 94 మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
తాజా బిడ్డింగ్ ను ప్యాకేజ్-ఏ, ప్యాకేజ్-బి, ప్యాకేజ్-సి, ప్యాకేజ్-డి గా విభజించారు. ప్యాకేజ్-ఏ టెలివిజన్ హక్కుల కోసం కాగా, ప్యాకేజ్-బి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించినది. ప్యాకేజ్-సి ప్రతి సీజన్ లో ఎంపిక చేసిన 18 మ్యాచ్ ల డిజిటల్ హక్కుల కోసం కాగా, ప్యాకేజ్-డి అన్ని మ్యాచ్ ల టీవీ, డిజిటల్ కంటెంట్ కోసం రూపొందించారు.
ఈసారి రేసులో ప్రధానంగా ప్రస్తుత హక్కుల సొంతదారు వాల్ట్ డిస్నీ (స్టార్), వయాకామ్ 18, జీ, సోనీ సంస్థలు పోటీపడుతున్నాయని బీసీసీఐ అధికారి వివరించారు. డిజిటల్ కంటెంట్ రేసులో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ ఏషియా, డ్రీమ్ 11, ఫ్యాన్ కోడ్ సంస్థలు పోటీలో ఉన్నాయి. ఇక, విదేశాల్లో టీవీ, డిజిటల్ హక్కుల కోసం స్కై స్పోర్ట్స్ (యూకే), సూపర్ స్పోర్ట్ (దక్షిణాఫ్రికా) రేసులో ఉన్నాయి.
కిందటిసారి స్టార్ ఇండియా సంస్థ టీవీ, డిజిటల్ హక్కులను రూ.16,347.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈసారి సంయుక్త హక్కుల కనీస బిడ్డింగ్ ధరే రూ.32 వేల కోట్లుగా నిర్దేశించడంతో బీసీసీఐకి కాసుల వర్షం ఖాయంగా కనిపిస్తోంది.