RGV: రామ్ గోపాల్ వర్మ, నట్టి కుమార్ మధ్య కుదిరిన రాజీ... కేసులు వెనక్కి!
- 'మా ఇష్టం' చిత్రం రూపొందించిన వర్మ
- సినిమా విడుదలను అడ్డుకున్న నట్టి కుటుంబం
- కోర్టు స్టే ద్వారా అడ్డగింత
- తన సంతకం ఫోర్జరీ చేశారంటూ వర్మ ఫిర్యాదు
- నట్టి కుటుంబ సభ్యులపై ఆరోపణలు
'మా ఇష్టం' సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. పరస్పరం నమోదు చేసుకున్న కేసులు వెనక్కి తీసుకుంటున్నట్టు వర్మ, నట్టికుమార్ సంయుక్తంగా ప్రకటించారు.
వర్మ రూపొందించిన 'మా ఇష్టం' సినిమా నేపథ్యంలో ఈ వివాదం బయల్దేరింది. నట్టి ఎంటర్టయిన్ మెంట్స్ కు చెందిన నట్టి క్రాంతి కుమార్, నట్టి కరుణ... వర్మపై కోర్టును ఆశ్రయించారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేస్తున్నారని పిటిషన్ వేశారు. కోర్టు స్టే ద్వారా 'మా ఇష్టం' సినిమా విడుదలను అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో, తన లెటర్ హెడ్ ను కాపీ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత నెలలో నట్టి క్రాంతి కుమార్, నట్టి కరుణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వర్మ, నట్టి కుమార్ మధ్య తాజాగా జరిగిన చర్చలు సుహృద్భావపూరిత వాతావరణంలో ముగిశాయి. ఇరువురు రాజీకి వచ్చారు.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, కొన్ని పరిస్థితుల వల్లే నట్టి కుటుంబంపై కేసు పెట్టాల్సి వచ్చిందని, అంతేతప్ప వారిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు.
నట్టి కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ మధ్య ఏర్పడిన అపార్థాలు, అపోహలు తొలగిపోయాయని అన్నారు. తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. కొందరు వ్యక్తుల కారణంగా తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, ఇప్పుడవన్నీ సమసిపోయాయని వివరించారు. అందుకే ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులను వెనక్కి తీసుకుంటున్నామని నట్టి కుమార్ వెల్లడించారు.