Zelensky: ముందే చెప్పినా జెలెన్ స్కీ వినిపించుకోలేదు: బైడెన్
- తమ వద్ద ఇంటెలిజెన్స్ సమాచారం ఉందన్న అమెరికా అధ్యక్షుడు
- జెలెన్ స్కీని ముందే హెచ్చరించినట్టు వెల్లడి
- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ తరహా దాడిని చూడలేదని వ్యాఖ్య
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం విషయమై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ లో జరిగిన డెమొక్రటిక్ నిధుల సమీకరణ కార్యక్రమంలో భాగంగా బైడెన్ మాట్లాడారు. తమ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం మాస్కో దాడికి సిద్ధమవుతోందంటూ చెప్పినా.. నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వినడానికి సిద్ధంగా లేడని చెప్పారు.
‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ తరహా పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కాలేదు. నేను అతిశయోక్తిగా చెబుతున్నానని చాలా మంది అనుకోవచ్చు. కానీ, అతడు (రష్యా అధ్యక్షుడు పుతిన్) సరిహద్దులను దాటి చర్యలు మొదలు పెట్టబోతున్నాడన్నది మాకు ముందుగానే తెలుసు. ఇందులో సందేహమే లేదు. కానీ, అతడు (ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ) దీన్ని వినడానికి కూడా ఇష్టపడలేదు’’ అని బైడెన్ అన్నారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై దాడులను రష్యా మొదలు పెట్టడం గమనార్హం. దానికి కొన్ని వారాల ముందే అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి సిద్ధమవుతోందంటూ హెచ్చరించాయి. అయినా జెలెన్ స్కీ అప్రమత్తం కాలేదంటూ విమర్శలు వస్తున్నాయి.