Google Pay: ‘గూగుల్ పే’కు మీ క్రెడిట్ కార్డు యాడ్ చేసి.. చెల్లించొచ్చు!
- ఎంతో సులభ ప్రక్రియ
- గూగుల్ పే యాప్ తెరిచి ప్రొఫైల్ కు వెళ్లాలి
- అక్కడ బ్యాంకు ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి
- క్రెడిట్/డెబిట్ కార్డు ఆప్షన్ కు వెళ్లి వివరాలు ఇస్తే చాలు
యూపీఐ చెల్లింపులు కరోనా వచ్చిన తర్వాత నుంచి కొత్త శిఖరాలకు చేరాయని చెప్పుకోవచ్చు. భౌతికంగా కరెన్సీ నోట్లతో చెల్లించడానికి బదులు.. ఎక్కువ మంది యూపీఐ యాప్ తో నగదు చెల్లించడం, నగదు బదిలీ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకనే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే తదితర సంస్థలకు యూజర్ల సంఖ్య, వ్యాపారం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఒక్క మే నెలలోనే సుమారు 450 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయంటే, ప్రజల ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యూపీఐ యాప్ ల నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకు ఖాతాలతో లింక్ చేసుకోవాలి. అప్పడు ప్రతీ చెల్లింపు బ్యాంకు ఖాతా నుంచి వెళుతుంది. యూపీఐ యాప్ కేవలం మధ్యవర్తిత్వ పాత్రకే పరిమితం అవుతుంది. చెల్లింపుల్లో సౌలభ్యం కూడా దీని ఆదరణను పెంచిందని చెప్పుకోవచ్చు.
ఇటీవలే ఆర్బీఐ యూపీఐ యాప్ లకు క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసుకోవడానికి అనుమతించింది. దీంతో ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల్లో బ్యాలన్స్ ఉంటేనే యూపీఐ చెల్లింపులకు అవకాశం ఉండేది. క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసుకోవడానికి అనుమతించడం సానుకూలం.
గూగుల్ పే ఈ అవకాశాన్ని ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డును గూగుల్ పే కు అనుసంధానించాలని అనుకునే వారు.. ముందుగా మొబైల్ లో గూగుల్ పే యాప్ తెరవాలి. యాప్ ఎగువ భాగంలో కుడి వైపున గుండ్రంగా కనిపించే దగ్గర క్లిక్ చేయాలి. అప్పుడు బ్యాంకు అకౌంట్ అని కనిపించే చోట ట్యాప్ చేయాలి. అక్కడ యాడ్ బ్యాంకు అకౌంట్, యాడ్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
క్రెడిట్/డెబిట్ కార్డ్ యాడ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ స్కానర్ తెరుచుకుంటుంది. కార్డును స్కాన్ చేయడం లేదంటే ఎంటర్ మ్యాన్యువల్ ఆప్షన్ ఎంపిక చేసుకుని కార్డు వివరాలను స్వయంగా నమోదు చేయాలి. ఆ తర్వాత బ్యాంకుకు అనుసంధానించి, ఓటీపీ ధ్రువీకరణ ఇచ్చిన అనంతరం కార్డు గూగుల్ పేకు యాడ్ అవుతుంది.