Nikhat Zareen: కామన్వెల్త్ బెర్తు ఖరారు చేసుకున్న నిఖత్ జరీన్... సెలెక్షన్ ట్రయల్స్ లో పంచ్ ల వర్షం
- జులై 28 నుంచి కామన్వెల్త్ క్రీడలు
- బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా క్రీడోత్సవం
- ఢిల్లీలో సెలెక్షన్ ట్రయల్స్
- 50 కేజీల విభాగంలో విజేతగా నిఖత్ జరీన్
ఇటీవలే బాక్సింగ్ లో వరల్డ్ చాంపియన్ షిప్ గెలిచి మాంచి ఊపుమీదున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల బెర్తు ఖరారు చేసుకుంది. కామన్వెల్త్ క్రీడలు ఈ ఏడాది జులై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరగనున్నాయి. ఈ పోటీల్లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారులకు ఢిల్లీలో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
ఇవాళ్టి సెలెక్షన్ ట్రయల్స్ లో నిఖత్ జరీన్ 7-0తో హర్యానాకు చెందిన మీనాక్షిని మట్టికరిపించింది. తద్వారా కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. 50 కేజీల విభాగంలో జరిగిన ఈ బౌట్ లో ఆద్యంతం నిఖత్ ఆధిపత్యం కనిపించింది. ప్రత్యర్థిపై పంచ్ ల వర్షం కురిపించింది. నిఖత్ అటాకింగ్ కు ప్రత్యర్థి మీనాక్షి నుంచి ప్రతిఘటన లేకుండా పోయింది.
అటు, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ (70 కేజీలు), నీతు (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) కూడా సెలెక్షన్ ట్రయల్స్ లో గెలిచి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యారు. కాగా, భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ గాయం కారణంగా సెలెక్షన్ ట్రయల్స్ నుంచి తప్పుకోవడంతో, కామన్వెల్త్ అవకాశం కోల్పోయింది.
.