Mithali Raj: భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించిన మిథాలీ రాజ్
- ఇటీవలే రిటైరైన లెజెండరీ క్రికెటర్
- అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన మిథాలీ
- అవకాశం వస్తే క్రికెట్ పాలన వ్యవహారాలు చేపడతానని వెల్లడి
- తన అనుభవం ఉపయోగపడుతుందని ధీమా
మిథాలీ రాజ్... తన అసమాన క్రికెట్ నైపుణ్యంతో, నాయకత్వ లక్షణాలతో భారత మహిళా క్రికెట్ రంగంలో లెజెండ్ అనిపించుకుంది. భారత క్రికెట్ రంగంలో మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్ మిథాలీనే. అన్ని ఫార్మాట్లలో 333 మ్యాచ్ లు ఆడి, 10,868 పరుగులు సాధించిన మహోన్నత క్రీడాకారిణి మన మిథాలీ. ఈ ఘనత ఆమెకే సొంతం. వన్డే క్రికెట్ లో ఆమె కెరీర్ 22 ఏళ్ల పాటు కొనసాగింది. మహిళల క్రికెట్లోనే కాదు, పురుషుల క్రికెట్లోనూ ఇన్నేళ్లపాటు వన్డే కెరీర్ కొనసాగించిన క్రికెటర్ మరొకరు లేరు.
అయితే, తనకెంతో ఇష్టమైన క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ మిథాలీ జూన్ 8న రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, తన భవిష్యత్ ప్రణాళికలను ఓ మీడియా సంస్థతో పంచుకుంది. అవకాశం లభిస్తే క్రికెట్ పాలన వ్యవహారాల్లోకి అడుగుపెడతానని మిథాలీ వెల్లడించింది. ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన అనుభవం తనకు ఈ దిశగా ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది. క్రికెటర్ గా వివిధ దశలను చూశానని, తన అనుభవాన్ని క్రికెట్లో మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగిస్తానని పేర్కొంది.
క్రికెట్ పాలకవర్గంలో ఓ మహిళ ఉంటే మహిళా క్రికెట్ గురించి మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని మిథాలీ అభిప్రాయపడింది. ఆస్ట్రేలియా జట్టు తరఫున అనేక ఏళ్ల పాటు ఆడిన బెలిండా క్లార్క్ ఇప్పుడు పాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తోందని వివరించింది. అటు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు క్లేర్ కానర్ కూడా ఇదే తరహాలో సేవలు అందిస్తోందని వెల్లడించింది. వారిద్దరూ తమ అనుభవాన్ని ఉపయోగిస్తూ జాతీయ జట్లను తీర్చిదిద్దుతున్నారని వివరించింది. అవకాశం ఇవ్వాలే గానీ, క్రికెట్ పాలన వ్యవహారాల్లో మహిళలు కూడా రాణించగలరని మిథాలీ ధీమా వ్యక్తం చేసింది.