Puducherry: గవర్నర్ తమిళిసైపై మాజీ సీఎం నారాయణస్వామి తీవ్ర ఆరోపణలు

Puducherry Ex CM V Narayanasamy fires on tamilisai soundararajan

  • మధుర మీనాక్షి ఆలయాన్ని సందర్శించిన నారాయణస్వామి
  • పుదుచ్చేరిలో తమిళిసై సూపర్ సీఎంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
  • రంగస్వామి డమ్మీ సీఎంగా మారిపోయారని ఎద్దేవా
  • తమిళనాడులో స్టాలిన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంస

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయాన్ని నిన్న దర్శించుకున్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో తమిళిసై సూపర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, దీంతో ముఖ్యమంత్రి రంగస్వామి డమ్మీ అయిపోయారని విమర్శించారు. గవర్నర్ స్థానంలో ఉన్న తమిళిసై రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రంలో హత్యలు, చోరీలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపించారు.

బీజేపీ పాలనలో దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ నీట్‌ను రద్దు చేయకపోవడంతో 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పథకాలను తమవిగా ప్రచారం చేసుకోవడం తప్పితే ఈ ఎనిమిదేళ్లలో బీజేపీ చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపొచ్చని అన్నారు. తమిళనాడులో స్టాలిన్ పాలన అద్భుతంగా ఉందని నారాయణస్వామి కొనియాడారు.

  • Loading...

More Telugu News