Sourav Ganguly: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కంటే ఐపీఎల్ అత్యధిక ఆదాయం అందిస్తుంది: సౌరవ్ గంగూలీ
- ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం ఈ-బిడ్డింగ్
- కాసేపట్లో తేలనున్న ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త
- ఐపీఎల్ అభివృద్ధి చెందుతూనే ఉంటుందన్న గంగూలీ
- ప్రేక్షకులే ఐపీఎల్ కు బలమని వెల్లడి
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం ముంబయిలో ఈ-బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, ఇండియా లీడర్ షిప్ కౌన్సిల్ ఈవెంట్ లో పాల్గొన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ప్రాభవం అంతకంతకు విస్తరిస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ప్రసిద్ధికెక్కిన ఫుట్ బాల్ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కంటే ఐపీఎల్ ఎక్కువ ఆదాయం అందిస్తుందని అన్నారు.
ఒకప్పుడు తనలాంటి ఆటగాళ్లు కేవలం కొన్ని వందల రూపాయలతో సరిపెట్టుకుంటే, ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని ఆటగాళ్లు కోట్లు సంపాదించగలుగుతున్నారని వెల్లడించారు. బీసీసీఐ నడిపిస్తున్న ఐపీఎల్ టోర్నీకి ప్రేక్షకులే బలం అని, దేశ ప్రజలే టోర్నీకి వెన్నుదన్ను అని గంగూలీ ఉద్ఘాటించారు. ఈ లీగ్ పునాదులు చాలా బలంగా ఉన్నాయని, ఇకముందు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.