Lalu Prasad Yadav: రాష్ట్రపతి రేసులో 'లాలూ ప్రసాద్ యాదవ్'... అసలు విషయం ఏమిటంటే...!
- ఈ లాలూ ఓ రైతు
- అతని పేరు కూడా లాలూ ప్రసాద్ యాదవ్
- వయసు 42 ఏళ్లు
- ఎన్నికల్లో పోటీ చేయడం ఓ హాబీ
- ఈ నెల 15న రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్
త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ దిశగా ఇప్పుడిప్పుడే ఆయా పార్టీలు రాజకీయాలు షురూ చేశాయి. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బరిలో దిగుతున్నారు. అయితే, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ మీరు అనుకునే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాదు. ఈయన ఓ సాధారణ రైతు. బీహార్ లోని సరన్ జిల్లాకు చెందినవాడు.
రాష్ట్రపతి ఎన్నికల కోసం ఈ నెల 15న ఢిల్లీలో నామినేషన్లు వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కు గతంలోనే ఉంది. 2017లోనూ నామినేషన్ వేశాడు. అయితే, తన నామినేషన్ పత్రాలు తిరస్కారానికి గురయ్యాయని 42 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించాడు. ఆ సమయంలో బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యారు.
కాగా, ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నామినేషన్ పత్రాలు రూపొందించినట్టు లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపాడు. తాను వ్యవసాయాన్ని జీవనోపాధిగా భావిస్తానని, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటానని వెల్లడించాడు. అంతేకాదు, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కు ఏడుగురు సంతానం. పెద్ద కూతురికి కొన్నాళ్ల కిందటే పెళ్లి చేశాడు.
ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. ఆర్జేడీ అధినేత లాలూ దాణా కుంభకోణంలో దోషిగా తేలగా, 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య రబ్రీదేవి సరన్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఈ ఎన్నికల్లో రైతు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పోటీ చేశాడు. అతడికి ఓ మోస్తరు ఓట్లు పడ్డాయి. అయితే, తన భార్య ఓటమికి లాలూ ప్రసాద్ యాదవే కారణమని ఆర్జేడీ అధినేత లాలూ ఆరోపించారు. ఇది తనకు గర్వకారణంగా భావిస్తానని రైతు లాలూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఈ రైతు 6 వేల వరకు ఓట్లు రాబట్టడం విశేషం.
పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్నింటా పోటీ చేస్తుంటానని, తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటానని రైతు లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించాడు. తాను గెలవకపోయినా, అత్యధిక ఎన్నికల్లో పోటీచేసిన రికార్డయినా దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.