Congress: ఇంటిలో భోజనం, ఆసుపత్రిలో తల్లికి పరామర్శ... తిరిగి ఈడీ ఆఫీస్‌కు రాహుల్
- మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి రాహుల్ గాంధీ
- భోజనం తర్వాత ఆసుపత్రిలో తల్లికి పరామర్శ
- ఆపై తిరిగి ఈడీ కార్యాలయానికి చేరుకున్న నేత
- మలి విడత విచారణను ప్రారంభించిన ఈడీ అధికారులు
నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వ్యవహారంలో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి విచారణలో భాగంగా భోజన విరామం దొరికిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి రాహుల్ రాగా ఆయనను ఈడీ అధికారులు 3 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనం చేసేందుకు రాహుల్ గాంధీ తన ఇంటికి వెళ్లేందుకు ఈడీ అధికారులు అనుమతించారు.
ఈ క్రమంలో ఈడీ కార్యాలయం నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ మధ్యాహ్న భోజనం ముగించారు. ఆ తర్వాత సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సోనియా గాంధీని పరామర్శించారు. తదనంతరం అక్కడి నుంచి ఆయన నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇలా మధ్యాహ్నం ఓ గంట పాటు విచారణ నుంచి విరామం తీసుకుని తిరిగి తమ కార్యాలయానికి వచ్చిన రాహుల్‌ను ఈడీ అధికారులు తిరిగి విచారిస్తున్నారు.