Bitcoin: భారీగా పడిపోయిన బిట్ కాయిన్ ధర... ఇతర క్రిప్టోలదీ అదే దారి!
- 40 ఏళ్ల గరిష్ఠానికి అమెరికా ద్రవ్యోల్బణం
- వడ్డీ రేట్లు పెంచుతున్న ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్
- తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్న క్రిప్టో మార్కెట్
- 7 శాతానికి పైగా పతనమైన బిట్ కాయిన్
క్రిప్టో కరెన్సీల్లో రారాజుగా వెలుగొందుతున్న బిట్ కాయిన్ ధర నేడు భారీగా పతనమైంది. బిట్ కాయిన్ ధరలో 7.73 శాతం తగ్గుదల నమోదై, దాని విలువ ఇప్పుడు 25 వేల డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథేరియంతో పాటు ఇతర క్రిప్టోలు సైతం దిగువచూపులు చూస్తున్నాయి.
ఎథేరియం 9.66 శాతం, డోజికాయిన్ 12 శాతం, షిబా ఇను 7 శాతం, ఎక్స్ ఆర్పీ 6 శాతం, కార్డానో 10 శాతానికి పైగా, సోలానో 12 శాతానికి పైగా, స్టెల్లార్ 8 శాతానికి పైగా, పోల్కాడాట్ 9 శాతానికి పైగా, అవలాంచే 12 శాతానికి పైగా, పోలీగాన్ 13 శాతానికి పైగా తగ్గుదల నమోదు చేశాయి.
అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరడం, గత కొన్నినెలలుగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుండడం క్రిప్టో మార్కెట్ ను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తోంది. మరికొన్నిరోజుల పాటు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని క్రిప్టో పెట్టుబడుల వేదిక మూడ్రెక్స్ సంస్థ సీఈవో ఇదుల్ పటేల్ అభిప్రాయపడ్డారు.