Kodali Nani: గుడివాడ ఫ్లై ఓవర్లను అడ్డుకుంటున్నారంటూ పురందేశ్వరిపై కొడాలి నాని ఆరోపణ
- గుడివాడకు కేంద్రం పలు ఫ్లై ఓవర్లను ప్రకటించిందన్న నాని
- అభివృద్ది పనులను అడ్డుకునే యత్నాలను విరమించాలని సూచన
- లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
గుడివాడకు కేంద్రం పలు ఫ్లై ఓవర్లను ప్రకటించిందని, అయితే వాటిని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అడ్డుకుంటున్నారంటూ వైసీపీ కీలక నేత, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో పురందేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారని, అదే హోదాతో ఆమె గుడివాడకు మంజూరైన ఫ్లై ఓవర్లను అడ్డుకుంటున్నారని నాని ఆరోపించారు.
ఈ మేరకు సోమవారం ఈ అంశాన్ని మీడియా ముందు ప్రస్తావించిన నాని... పురందేశ్వరికి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా గుడివాడ అభివృద్ది పనులను అడ్డుకునే యత్నాలను విరమించాలని ఆయన పురందేశ్వరికి సూచించారు. లేనిపక్షంలో పురందేశ్వరి తీవ్ర పరిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని నాని హెచ్చరించారు.