Kaulu Raithu Bharosa: జనసేన కౌలు రైతు భరోసా నిధికి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల విరాళాలు... వివరాలు ఇవిగో!
- ఏపీలో కౌలు రైతుల ఆత్మహత్యలు
- కౌలు రైతుల భరోసా కార్యక్రమం ప్రకటించిన జనసేన
- ఇప్పటికే పలు జిల్లాల్లో పవన్ పర్యటనలు
- మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం
- విరాళాలతో ముందుకొచ్చిన సాయితేజ్, వరుణ్ తేజ్ తదితరులు
ఏపీలో మరణించిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా, వారికి ఆర్థికసాయం కూడా అందించారు. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు జనసేన కౌలు రైతు భరోసా కార్యక్రమానికి విరాళాలు అందించారు.
ఇవాళ జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ కు విరాళాల తాలూకు చెక్కులు అందించారు. సాయి తేజ్ రూ.10 లక్షలు, వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ.5 లక్షలు అందించారు. వీరేకాకుండా నిహారిక, నాగబాబు-పద్మజ, పవన్ సోదరి మాధవి, ఇతర కుటుంబ సభ్యులు కూడా విరాళాలు ఇచ్చారు. ఈ విధంగా మొత్తం రూ.35 లక్షలు అందించారు. వీరికి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో ఎంతోమంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, ఇంటి యజమానులను కోల్పోయి వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కౌలు రైతుల భరోసా కార్యక్రమం ప్రారంభించి, మరణించిన కౌలు రైతుల పిల్లలకు మంచి భవిష్యత్తు నివ్వాలని నిర్ణయించిందని తెలిపారు.
తమ కార్యక్రమం పట్ల మెగా ఫ్యామిలీ కూడా స్పందించి ముందుకు రావడం హర్షణీయమని కొనియాడారు. పార్టీ ఏర్పాటు చేసిన సహాయనిధికి వారంతా కలిసి రూ.35 లక్షలు విరాళంగా ఇవ్వడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు ఆయన సోదరుడు నాగబాబు, వదిన పద్మజ, సోదరి మాధవి, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.