Nikhat Zareen: ఓ వర్గానికి కాదు... దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా: బాక్సర్ నిఖత్ జరీన్
- ఇటీవలే వరల్డ్ టైటిల్ గెలిచిన నిఖత్ జరీన్
- ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధం
- హిందూ, ముస్లిం అనేది పెద్ద విషయం కాదన్న నిఖత్
- దేశమే ముఖ్యమని వెల్లడి
ఫ్లయ్ వెయిట్ విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (25) తాను కేవలం ఓ వర్గానికి ప్రాతినిధ్యం వహించడంలేదని, తాను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని స్పష్టం చేసింది. తాను బాక్సింగ్ లో సాధించిన ఘనతల కంటే, తన మత నేపథ్యం గురించే ప్రజలు ఎక్కువగా చర్చించుకుంటున్నారన్న ప్రశ్నకు ఆమె పైవిధంగా జవాబిచ్చింది.
ఓ అథ్లెట్ గా తాను భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తానని, తన వరకు హిందూ, ముస్లిం అనేది పెద్ద విషయమే కాదని అభిప్రాయపడింది. "నా దేశానికి ఓ పతకం సాధించడం పట్ల ఎంతో సంతోషిస్తాను" అని నిఖత్ వెల్లడించింది.
నిఖత్ వచ్చే నెలలో బ్రిటన్ లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కు సన్నద్ధమవుతోంది. ఢిల్లీలో నిర్వహించిన ట్రయల్స్ లో నిఖత్ విజయం సాధించి కామన్వెల్త్ క్రీడలకు అర్హత పొందింది.