BCCI: మాజీ క్రికెటర్లు, అంపైర్ల పింఛను మొత్తాన్ని భారీగా పెంచిన బీసీసీఐ
- కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చిన బీసీసీఐ
- దాదాపు రెట్టింపైన పింఛన్లు
- మాజీల క్షేమం తమకు ముఖ్యమన్న గంగూలీ
- అదే అభిప్రాయం వ్యక్తం చేసిన జై షా
మాజీ క్రికెటర్లు, మాజీ అంపైర్లకు బీసీసీఐ కొత్త పెన్షన్ విధానం రూపొందించింది. పురుష, మహిళా మాజీ క్రికెటర్లకు, మాజీ అంపైర్లకు నెలవారీ పెన్షన్ ను పెంచుతున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, మాజీ ఆటగాళ్లు, అంపైర్ల ఆర్థిక స్థితిగతులు కూడా తమకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. ఆటకు వీడ్కోలు పలికినప్పటికీ వారి బాగోగులను పట్టించుకోవడం బోర్డు విధి అని వెల్లడించారు. వాస్తవానికి అంపైర్లు పెద్దగా గుర్తింపుకు నోచుకోరని, ఈ నేపథ్యంలో, వారు అందించిన సేవలకు బీసీసీఐ ఎంతో విలువ ఇస్తుందని అన్నారు.
బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. భారత క్రికెట్ కు వారు అందించిన సేవలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు. దాదాపు 900 మంది వరకు తాజా పెన్షన్ స్కీమ్ ద్వారా లబ్ది పొందుతారని, వారిలో 75 శాతం మంది వందశాతం పెన్షన్ పెంపు ప్రయోజనం అందుకుంటారని జై షా వివరించారు.
ఇప్పటిదాకా నెలకు రూ.15 వేలు అందుకునేవారు ఇకపై రూ.30 వేలు... రూ.22,500 అందుకునేవారు ఇకపై రూ.45,000... రూ.30 వేలు అందుకునేవారు ఇకపై రూ.52 వేలు... రూ.37,500 అందుకునేవారు ఇకపై రూ.60,000... రూ.50,000 అందుకునేవారు రూ.70,000 పెన్షన్ అందుకోనున్నారు.